శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (08:57 IST)

భారీ వర్షాలు, అకాల వడగళ్ల వానలు.. ఆరు జిల్లాల రైతులకు భారీ నష్టం

Farmer
భారీ వర్షాలు, అకాల వడగళ్ల వానలతో తెలంగాణలోని ఆరు జిల్లాల రైతులు భారీగా నష్టపోయారు. ఒక్కరోజులోనే 50 మండలాల్లోని 650 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లింది.
 
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని మైలార్ దేవులపల్లి, శివరాంపల్లిలో కూడా భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట, మర్పల్లి మండలాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
 
సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలాలతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానతో పంటలన్నీ నేలకొరగడంతో పచ్చిమిర్చి బాగా దెబ్బతిన్నది. పలు జిల్లాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
హైదరాబాద్ శివారు జిల్లాల్లో కూరగాయల రైతులు భారీగా నష్టపోయారు. టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ పంటలకు భారీగా నష్టం వాటిల్లగా, బొప్పాయి, పుచ్చకాయ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.