శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 28 అక్టోబరు 2018 (18:39 IST)

రేవంత్ రెడ్డిపై 100 కోట్ల పరువు నష్టం దావా

ఈవెంట్స్ నౌ కంపెనీ పైన రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వాటిని ఉపసంహరించుకోకుంటే, పరువు నష్టం దావాకి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలని కంపెనీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. రేవంత్ రెడ్డికి ఈ-కామర్స్ కంపెనీలు పని చేసే విధానం పైన ఏ మాత్రం అవగాహన లేదన్న విషయం ఈ రోజు ఆయన చేసిన ఆరోపణలతో అర్థమైందని, చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక కంపెనీ పైన ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. 
 
కార్యక్రమాలకు టికెటింగ్ చేయడం, ఈవెంట్  నిర్వహించడం పూర్తి భిన్నమైన వ్యాపారాలన్న కనీస అవగాహన రేవంత్ రెడ్డికి లేదని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న సేన్సెషన్ కార్యక్రమానికి ఈవెంట్స్ నౌకి ఎలాంటి సంబంధం లేదని సంస్థ తెలిపింది.  ఈవెంట్స్ నౌ కంపెనీ స్వయంగా ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించదని, దేశంలో వందల సంఖ్యలలో ఉన్న టికెటింగ్ కంపెనీలలో అగ్రగామిగా ఉన్న కంపెనీలలో ఈవెంట్స్ నౌ ఒకటి. 
 
బుక్ మై షో, పేటీఎం వంటి ప్రఖ్యాత టికెటింగ్ మరియు ఈ- కామర్స్ కంపెనీల మాదిరే ఈవెంట్స్ నౌ పని చేస్తుంది. ఇప్పటిదాకా ఈవెంట్స్ నౌ ఒక్క కార్యక్రమాన్ని కూడా స్వయంగా నిర్వహించలేదు అన్న విషయాన్ని తెలిపింది. గతంలోనూ ఇలాంటి అవాకులు చెవాకులు పేలిన రేవంత్ రెడ్డికి కంపెనీ తరఫున లీగల్ నోటీస్ ఇచ్చామని, దానికి సమాధానం ఇవ్వలేక రేవంత్ రెడ్డి పారిపోయిన విషయాన్ని కంపెనీ గుర్తు చేసింది. 
 
రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మంత్రి కేటీఆర్ బావమరిది సంస్థ పైన అవాస్తవాలతో కూడిన గోబెల్స్ ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. ఈవెంట్స్ నౌ వ్యవస్థాపకులు రాజ్ పాకాల అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ కంపెనీలను నిర్వహిస్తున్నారని సంస్థ తెలిపింది. గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎంతో మంది యువతకు ఉపాధిని కల్పిస్తూ, ఎటువంటి మచ్చ లేకుండా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజ్ పాకాలను కేవలం మంత్రి కేటీఆర్ బంధువు అయిన కారణంగా ఇలాంటి ఆరోపణలను చేయడాన్ని కంపెనీ ఆక్షేపిస్తున్నది.
 
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ది కోసం చేసినవే అని, ఈ వ్యాఖ్యలు సంస్థ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఉన్నందున రేవంత్ రెడ్డి పైన 100 కోట్ల పరువు నష్టం దావా కేసు వేసి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మరి ఈ ప్రకటనలకు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.