శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:42 IST)

సిద్ధంగా మాస్క్‌లు, శానిటైజర్‌, సబ్బు నీళ్లు .. దుబ్బాక బైపోల్ పోలింగ్ ప్రారంభం!

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ స్థానంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
 
దీనికి తోడు సవాళ్లు, ప్రతిసవాళ్లతో దుబ్బాక వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా, ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ఓటర్లు బారులుతీరారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ఈ నెల 10న ఓట్లను లెక్కించనున్నారు.
 
పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు రెండు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా హోంక్వారంటైన్‌లో ఉన్న 130 మందిలో 93 మంది ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోలింగ్‌ సమయం ముగియడానికి గంట ముందు కరోనా రోగులను ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. వీరికి ప్రత్యేక పీపీఈ కిట్లు అందించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భౌతికదూరం పాటించేలా ప్రత్యేకంగా గుర్తులను ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల్లోకి వచ్చే ప్రతి ఓటర్‌ను స్క్రీనింగ్‌ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
 
అలాగే మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు గ్లౌజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్‌, సబ్బు నీళ్లు అందుబాటులో ఉంచారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలో పట్టణ పురపాలక విభాగం, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలు, మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగి మండలాలు ఉన్నాయి. 
 
మొత్తం 1,98,756 మంది ఓటర్లలో మహిళలు 1,00,778 మంది, పురుషులు 97,978 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 315 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిలో 89 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణలో 400 మంది పీవోలు, 400 మంది ఏపీవోలు, 800 మంది అదనపు పోలింగ్‌ అధికారులను నియమించారు.
 
104 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, 98 కేంద్రాల్లో వీడియోగ్రాఫర్లు, 113 కేంద్రాల్లో అన్‌మ్యాన్డ్‌ కెమెరాలు, 80 మంది సూక్ష్మ పరిశీలకులు, 32 మంది సెక్టార్‌ ఆఫీసర్లు, 32 మంది అసిస్టెంట్‌ సెక్టార్‌ ఆఫీసర్లు, 5 వేల మంది రెవెన్యూ, పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్పీ బలగాలు 2వేల మంది బందోబస్తు నిర్వహించారు.