జంగారెడ్డిగూడెంలో భారీగా అక్రమ గంజాయి పట్టివేత
అక్రమంగా లారీలో తరలిస్తున్న 80 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం సిఐ ఎస్ గౌరీ శంకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ ఐ కే సతీష్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బయ్యన గూడెం గ్రామంలో నేషనల్ హైవే పై ఎస్ఐ కే సతీష్ కుమార్ తన సిబ్బందితో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా కొయ్యలగూడెం వైపు నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళుతున్న గూడ్స్ కంటైనర్ లారీని తనిఖీ చేశారు.
తనిఖీల్లో 26 ప్లాస్టిక్ సంచుల్లో 786.55 కేజీల గంజాయిని గుర్తించామన్నారు. విచారణ చేయగా విశాఖ జిల్లా గారకొండ గ్రామ సమీపం నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు రవాణా చేస్తున్నట్లు తెలిసిందన్నారు.
దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీరాజ్, దేవేంద్ర సింగ్ లను అదుపులోకి తీసుకుని కంటైనర్ను గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు 80 లక్షలు ఉంటుందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.