శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:34 IST)

బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ కాలేదా? పోస్టాఫీసుకు వెళ్లండి...

కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి, తమ ఇళ్ళకే పరిమితమైన పేదలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1500 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా, ఇప్పటికే నగదును బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అయితే, అనేక మందికి రూ.1500 డిపాజిట్ కాలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. 
 
బ్యాంక్ ఖాతాల్లో నగదు డిపాజిట్ కాకుంటే ల్యాండ్‌‌లైన్‌ 040-23324614, 23324615 నంబర్లకుగానీ, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967కుగానీ ఫోన్ చేసి సంప్రదించాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు సూచన చేశారు. టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి, రేషన్ కార్డు నంబర్ చెబితే, వారు పరిశీలించి, ఎవరి ఖాతాలో, ఏ బ్యాంకులో డబ్బు పడిందో వెల్లడిస్తారు. 
 
ఒకవేళ, డబ్బు పడకుంటే, అందుకు గల కారణాలను తెలుపుతారు. ఏ విధమైన బ్యాంకు ఖాతాతో సదరు కుటుంబం ఆధార్ కార్డు వివరాలు అటాచ్ కాకుంటే, పోస్టాఫీసుకు వెళ్లి రేషన్ కార్డును చూపిస్తే, వారు బయోమెట్రిక్ తీసుకుని వెంటనే డబ్బు ఇస్తారని, అయితే, ఇంట్లోని కుటుంబ పెద్దగా కార్డులో గుర్తింపు పొందిన మహిళకు మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
 
తపాలా శాఖ ద్వారా కూడా నగదును పంపిణీ చేస్తున్నామని రేషన్ కార్డును చూపించి నగదు పొందవచ్చని సలహా ఇచ్చారు. ఈ నిర్ణయం బ్యాంకు ఖాతాలు లేని పేద కుటుంబాలకు మేలు కలిగిస్తుందని వివరించారు. ఈ పోస్టాఫీసుల్లో రేషన్ కార్డులకు డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే హైదరాబాద్ నగరంలో శ్రీకారం చుట్టారు.