మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (09:27 IST)

అమెరికాలో పడగ విప్పిన కరోనా-24 గంటల్లో 3,176 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3,176 మంది కరోనా వైరస్‌తో మరణించారు. ఇప్పటివరకు 8.79 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గురువారం కొత్తగా 30,713 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 49,769 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
85 వేల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. న్యూయార్క్‌లో 20,861, న్యూజెర్సీలో 5,428, మాసాచుసెట్స్‌లో 2,360, కాలిఫోర్నియాలో 1,523, పెన్సిల్వానియాలో 1,685, మిచిగాన్‌లో 2,977, ఫ్లోరిడాలో 987, లూసియానాలో 1,599 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కారణంగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది.
 
ఇదిలా ఉంటే.. అమెరికా వైద్యారోగ్య అధిపతి చెప్పిన మాటలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా 50వేల మందిని కోల్పోయిన అమెరికాపై మరోసారి కరోనా తన ప్రకోపాన్ని చూపనుందని చెప్పారు. వచ్చేది ఫ్లూ సీజన్ కావడంతో కరోనా ప్రభావం మరింతగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేది చలి కాలం కావడంతో కరోనావైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని, ఈ మహ్మారిని కట్టడి చేయడం మరింత కష్టంగా మారనుందని అన్నారు.