హైదరాబాద్‌లో మాయం.. ముంబైలో ప్రత్యక్షం... బీటెక్ విద్యార్థిని ఆచూకీ లభ్యం
హైదరాబాద్ నగరంలో కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థిని ఒకరు ముంబైలో ప్రత్యక్షమైంది. దీంతో ఆ విద్యార్థిని అదృశ్యం కథ సుఖాంతమైంది. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వర్షిణి అనే బీటెక్ విద్యార్థిని ముంబైలో ఉన్నట్టు గుర్తించారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, వర్షిణి అనే విద్యార్థిని కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. మిడ్ ఎగ్జామ్ కోసం ఆమెను సమీప బంధువు మోహన్‌రెడ్డి కళాశాలకు తీసుకెళ్లారు. అనంతరం ఐడీ కార్డు, మొబైల్ ఇంట్లో మరిచిపోయానని చెప్పి ఆమె క్యాంపస్ నుంచి తిరిగి బయటకు వచ్చింది.
సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని భావించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. విద్యార్థిని కోసం గాలించారు. క్యాంపస్‌కు వెళ్లిన తర్వాత ఆమె బయటకు వచ్చే సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు.
కాగా, వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ ముంబయిలో ఓపెన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. విద్యార్థిని ఉన్న టవర్ లోకేషన్ ఆధారంగా ముంబయి స్థానిక పోలీసులు, రైల్వే పోలీసుల సాయంతో వర్షిణిని గుర్తించారు.
ప్రస్తుతం విద్యార్థిని రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ముంబై వెళ్లిన మేడ్చల్ పోలీసులు విద్యార్థినిని తీసుకొని ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. చదువు విషయంలో కాస్త డిప్రెషన్‌కు గురికావడంతోనే ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.