1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలో పని చేయని రాడార్లు

doppler radar
హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో వాతావరణంలో సంభవించే మార్పులను పసిగట్టి సంకేతాల రూపంలో సందేశాన్ని పంపించే అత్యంత కీలకమైన రాడార్ డాప్లర్ వ్యవస్థ పని చేయడం లేదు. వాతావరణ శాఖ ఢిల్లీ నుంచి ఇంజినీర్లను పంపి మరమ్మతులు చేయించినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. 
 
మచిలీపట్నం, విశాఖపట్టణం, నాగ్‌పుర్‌ రాడార్ల పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం దాదాపుగా వస్తున్నందున వాటి నుంచి సూచనలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు డా.నాగరత్న తెలిపారు. 
 
డాఫ్లర్‌ మరమ్మతు చేయించాలని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చామని వివరించారు. ఉపగ్రహాలిచ్చే చిత్రాల ఆధారంగానూ వాతావరణ సూచనలు ఇవ్వవచ్చని, ప్రస్తుతం వాటిని వినియోగించుకుంటున్నామని చెప్పారు.
 
మరోవైపు, సూర్యుడి చుట్టూ భూగ్రహం తిరిగే అంశంలో వచ్చే నెల(2022 ఆగస్టు)లో సౌరతరంగాల వల్ల వాతావరణం మారిపోయి గతేడాదికన్నా చాలా చల్లగా ఉంటుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని డాక్టర్‌ నాగరత్న చెప్పారు.