లైసెన్స్ లేని యువతికి బైకిచ్చి జైలుపాలైన హైదరాబాద్ వాసి!
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లైసెన్స్ లేని యువతికి వాహనం ఇచ్చిన వ్యక్తిని జైలుకు పంపించారు.
ఈనెల 20న రేష్మ (20) స్నేహితులతో కలిసి మియాపూర్‌లో ఓ థియేటర్‌లో సినిమా చూశారు. తిరిగొచ్చే క్రమంలో స్నేహితుల్లో ఒకరైన అజయ్‌సింగ్ నడుపుతున్న స్కూటీపై ఆమె వెనుక కూర్చొంది. రాత్రి 11.40 గంటల సమయంలో మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను బండి నడుపుతానని వాహనం తీసుకుంది.
కొంతదూరం నడిపిన అనంతరం వాహనం అదుపు తప్పి హైదర్‌నగర్ వద్ద ఇసుక లారీ చక్రాల కింద పడిపోవడంతో ఆమె చనిపోయింది. రేష్మకు బండి నడపడం రాదు. లైసెన్స్ కూడా లేదు. ఈ విషయం తెలిసీ, వాహనం ఇచ్చిన అజయ్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. లారీ డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నాడు.