శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:48 IST)

ముంచిన బంధువులు.. టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య

తీసుకున్న రుణాలు బంధువులు తిరిగి చెల్లించకపోవడంతో ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్‌లో మేనేజరుగా పని చేస్తూవచ్చిన టెక్కీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన నడిశెట్టి బాలశ్రీధర్ (44) గత నాలుగేళ్లుగా టీసీఎస్‌లో మేనేజరుగా పని చేస్తున్నాడు. 
 
గతంలో ఆయన బంధువులు, స్నేహితులకు అప్పులు ఇచ్చాడు. అవి వసూలు కాకపోవడంతో ఇతరుల వద్ద అప్పులు చేశాడు. ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడం, తీసుకున్న అప్పులు  చెల్లించడం కష్టం కావడంతో గతంలోనే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మనోవేదన అనుభవించాడు.
 
ఈ క్రమంలో ఆయన ఎస్ఆర్ నగర్ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థనగరులో తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఆయన భార్య పద్మ పిల్లలను తీసుకుని డీమార్ట్‌కు షాపింగ్ చేయడానికి వెళ్లింది. 
 
అదేసమయంలో ఇంట్లో ఫ్యాన్‌‍కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీమార్ట్ నుంచి తిరిగి వచ్చిన పద్మకు ఆయన విగత జీవిగా కనిపించారు. ఆమె పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.