ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (08:45 IST)

చరిత్రలో మొదటిసారి.. కోకాపేటలో ఎకరం భూమి ధర రూ.100 కోట్లు...

Kokapet lands
హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో భూముల ధరలు చరిత్రను తిరగరాశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇక్కడ ఒక ఎకరం భూమి ధర కోట్లాది రూపాయలు పలికింది. తాజాగా నిర్వహించిన వేలం పాటల్లో కోకాపేటలో ఒక ఎకరం భూమి ధర రూ.100 కోట్ల పలికింది. నియోపోలిస్ ఫేజ్-2లో ఫ్లాట్ నంబర్ 3, 7, 8 వేలం వేశారు. అయితే, ఫ్లాట్ నంబర్ 10లో ఎకరం భూమి ధర ఏకంగా రూ.100 కోట్లు దాటిపోయింది. దీన్ని సెల్వన్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. 
 
కోకాపేట భూములను గురువారం ఈ-వేలం ద్వారా విక్రయించారు. ఇందులో నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో భూముల ధర హైదరాబాద్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్లాట్ నెంబర్ 10లో ఎకరా భూమి ధర ఏకంగా రూ.100.25 కోట్లు పలికింది. హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. అయితే ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీ పడటంతో చరిత్రలోనే అత్యధిక ధర నమోదైంది.
 
ప్లాట్ నెంబర్ 10లో 3.6 ఎకరాలు ఉండగా, ఈ-వేలం ద్వారా రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ భూమిని కొనుగోలు చేసింది సెల్వన్ కంపెనీగా తెలుస్తోంది. ప్లాట్ నెంబర్ 9లో ఎకరాకు రూ.76.5 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదిలావుండగా, ఎకరం ధర అత్యల్పంగా రూ.51.75 కోట్లు పలికింది. ఇక గజం ధర సరాసరిని 1.5 లక్షలు పలకడం విశేషం. 
 
నియో పోలిస్ ఫేజ్ 2లోని ఈ నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.1,532.20 కోట్ల ఆదాయం సమకూరింది. 45 ఎకరాలలో ఉన్న 7 ప్లాట్లకు ప్రభుత్వం రూ.2500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. నేటి తీరు చూస్తే మరింత ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్లాట్ల వేలంలో షాపూర్ జీ పల్లోంజీ, ఎన్సీసీ, మైహోం, రాజ్ పుష్పా తదితర రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.