నా వాహనం లోనే మధ్యప్రదేశ్ పంపిస్తా: వలస కూలీలకు హరీష్ రావు హామీ
లాక్ డౌన్ పూర్తయ్యాక.. నా వాహనం ఇచ్చి మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తానని మధ్యప్రదేశ్ కు చెందిన సుస్మిత గర్భిణీ కుటుంబీకులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి రామయంపేట మీదుగా దాదాపు 10 మంది కుటుంబీకులు కలిసి గత నాలుగు రోజులుగా కాలినడకన మధ్యప్రదేశ్ కు బయలుదేరారు.
వీరిలో ఒకరైన సుస్మిత గర్భిణీగా ఉండగా, ఆమెకు వైద్య చికిత్స అవసరమైన విషయాన్ని తెలుసుకున్న మంత్రి మిమ్మల్ని అన్నీ రకాలుగా చూసుకుంటామని, వారిని సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ మేరకు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న సుస్మితను గురువారం ఉదయం పరామర్శించారు.
ఈ సందర్భంగా సుస్మిత తమ అత్తగారింటికి వెళ్ళాల్సి ఉందని, మాకే ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదంటూ.. తమ కుటుంబ అత్త, మామ, తమ పుట్టింటి వారి ఆవేదనను మంత్రితో చెప్పుకొచ్చింది.
ఈ లాక్ డౌన్ లో, పైగా ఎండలో కాలినడకన వెళ్లడం మంచిది కాదని, మీకు అన్నం పెట్టిస్తా, కావాల్సిన పని ఇప్పిస్తా. మే 7వ తేదీన లాక్ డౌన్ పూర్తయ్యాక నా ప్రత్యేక వాహనంలో మిమ్మల్ని నేనే మధ్యప్రదేశ్ లోని స్వస్థలానికి పంపిస్తానని మాట ఇచ్చారు.
మధ్యప్రదేశ్ సీఏంఓ కార్యాలయం నుంచి మిమ్మల్ని బాగా చూసుకోవాలని, తనకు ఫోన్ వచ్చిందని, మిమ్మల్ని బాగా చూసుకుంటానని వారికి మాట ఇచ్చానని, మీకు మాట ఇస్తున్నట్లు లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకూ ఎక్కడికి వెళ్లోద్దని, మాకు సహకరించాలని, ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఉంటే తన ఫోన్ 9866199999 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
రాష్ట్రేతరులకు కూడా నిత్యావసర సరుకులను, వారికి షెల్టర్ ఇవ్వడంతో పాటు, వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వారికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు.