శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (06:31 IST)

ఓట్ల కోసమే కేసీఆర్, జగన్​ల భేటీ: కాంగ్రెస్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరు గంటలకుపైగా సుదీర్ఘ చర్చలు జరపడంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పలు ఆరోపణలు చేశారు. మున్సిపల్లో ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ ఇలా చేశారంటూ ధ్వజమెత్తారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరు గంటలకుపైగా సుదీర్ఘ ఏకాంత చర్చలు చేయడంలో పారదర్శకత ఎక్కడ ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో అధికారులు లేకుండా రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు.

తెలంగాణాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో... వైస్సార్ అభిమానులను తమ పార్టీ వైపు తిప్పుకునే ఉద్దేశంతోనే కేసీఆర్ దొంగ నాటకం ఆడారని లక్ష్మయ్య ఆరోపించారు. ఆంధ్రప్రాంత ఓటర్లు ఉన్న మున్సిపాలిటీల్లో కొద్దో, గొప్పో ఓట్లు వస్తాయని ఆశించే కేసీఆర్... జగన్‌తో భేటీ అయ్యారని ధ్వజమెత్తారు.

పోతిరెడ్డిపాడు ద్వారా గడిచిన మూడేళ్లుగా ఎక్కువ నీటిని ఏపీకి తరలిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ మరణం తర్వాత కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మరిచిపోవద్దని విజ్ఞప్తి చేశారు.

కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం గురించే మాట్లాడినట్లయితే నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఎందుకు సమావేశంలో లేరని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముగూడెం సాగర్ టైల్ పాండ్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసి పనులు ప్రారంభిస్తే... అప్పుడు కేసీఆర్ నానా హంగామా చేశారని, ఇప్పుడు గోదావరి నీటిని కృష్ణకు తరలిస్తే తప్పేంటిని మాట్లాడుతున్నారని ఆరోపించారు.