ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:12 IST)

ఛైర్మన్​, మేయర్​ పదవులన్నీ మనవే: కేసీఆర్

పురపాలక ఎన్నికల్లో తెరాస విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు..పురపాలక ఇన్‌ఛార్జ్‌లతో జరిగిన సమావేశంలో వివరించారు.

పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్​ పంపిణీ చేశారు. పురపాలికలు, నగరపాలికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపునిచ్చారు.

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉందని కేసీఆర్​ తెలిపారు. నాయకత్వం వహించాలని ఆశపడటంలో ఏ మాత్రం తప్పు లేదని.. అయితే టికెట్ దక్కని నేతలు నిరాశ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయని... నామినేటెడ్ పోస్టులు ఎన్నో భర్తీ చేయాల్సి ఉందన్న విషయం వివరించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. అసంతృప్తులు, అసమ్మతుల మాట వినిపించకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులదేనని స్పష్టం చేశారు.