శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఆర్. సందీప్
Last Modified: గురువారం, 21 మే 2020 (22:01 IST)

అత్తవారింటికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య చేసుకుంది

కొత్తగా పెళ్లయిన యువతిని అత్తారింటికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన మూడు రోజులకే లాక్‌డౌన్‌ ప్రారంభమవడంతో ఆమె అత్తవారింటికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. హైదరాబాద్ ఉప్పుగూడ దానయ్యనగర్‌కు చెందిన మోహన్‌ కుమార్తె వనజకు వరంగల్‌కు చెందిన అనిల్‌‌కు మార్చి 19న వివాహం జరిగింది. 
 
లాక్‌డౌన్ కారణంగా రవాణా వసతి లేక ఆమెను అత్తారింటికి తీసుకువెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని భర్తను తరచూ కోరుతుండటంతో, లాక్‌డౌన్ ముగిశాక సంప్రదాయబద్ధంగా తీసుకెళ్తామని అత్తమామలు చెప్పారు. అనిల్ రెండుమూడు సార్లు బైక్‌పై అత్తారింటికి వచ్చి భార్యను చూసి వెళ్లాడు. అయినా కూడా భర్తకు దూరంగా ఉండటం ఆమెను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.
 
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు అది గమనించి వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. పెళ్లయిన రెండు నెలలకే విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.