గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (15:33 IST)

మాదన్నపేట మండి... చినుకు పడితే చిత్తడి

హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద కూరగాయల మార్కెట్‌లలో ఒకటైన మాదన్నపేట మండి చినుకుపడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. చిన్నపాటి వర్షానికే మార్కెట్‌లో అడుగు తీసి అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. శివారులోని రంగారెడ్డి జిల్లా నుండి సుమారు 30 గ్రామాలకు చెందిన వందలాది రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు మాదన్నపేట మండికి చేరుకుంటారు.
 
నిత్యం వేల సంఖ్యలో వినియోగదారులు ఈ మండికి కొనుగోళ్ల కోసం వస్తారు. రైతులు, వినియోగదారుల రాకపోకలతో మాదన్నపేట మండి నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షానికి మండి ఆవరణ మురుగు జలాశయంలా మారింది. మార్కెట్లో వర్షం నీరు బయటికి వెళ్ళే మార్గం లేక మండి మొత్తం బురదమయంగా మారింది. మార్కెట్ లోకి వెళ్లివచ్చే వీలులేక వినియోగదారులు తగ్గిపోయారు. 
 
కానీ కష్టించి పండించిన పంటను వర్షంలోనూ వ్యయప్రయాసలకు ఓర్చి మాదన్నపేట మండికి తీసుకువస్తే కొనేవారు లేక విలువైన పంటను వర్షం నీరు, బురదలోనే పడేసి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండిలో అమ్మకం పన్నులు చెల్లిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించరా అని మార్కెటింగ్ అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిహెచ్ ఎంసీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు స్పందించి మాదన్నపేట మండి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.