మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (14:36 IST)

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్నిన వైకాపా ఎమ్మెల్యే కుమారుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు చెందిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైకాపాకు చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఒకరు విధుల్లో నిమగ్నమైవున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్నాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రద్దీ నియంత్రణలో భాగంగా హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న వాహనాలను కొద్ది సేపు నిలిపాడు. అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలు అతిక్రమించి ముందుకు వెళుతుండటంతో వారించాడు. కారులో నుంచి దిగిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను కుమారుడు సామినేని ప్రసాద్‌ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. 
 
'నన్ను నువ్వు అంటావా' అంటూ దుర్భాషలాడాడు. రోడ్డుకు అవతలివైపు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌ రెడ్డి అక్కడి చేరుకుని అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. అతను లెక్కపెట్టకపోవడంతో స్టేషన్‌కు రావాల్సిందిగా కోరారు. ఈ పరిణామంతో  ఆగ్రహించిన ప్రసాద్‌ 'నన్ను సేష్టన్‌కు రమ్మంటావా?' అంటూ ఇన్‌స్పెక్టర్‌ను పక్కకు నెట్టేయడంతోపాటు ఆయన్ని కాలుతో తన్ని, దూషించాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మిగతా పోలీసుల సాయంతో సీఐ అతన్ని అదుపులోకి తీసుకుని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై 332, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.