సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా తెలుగు బిడ్డ... అలోక్ వర్మపై వేటు
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక కొత్త డైరెక్టరుగా తెలుగు బిడ్డ నియమితులయ్యారు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన మన్నెం నాగేశ్వరరావును ఈ పదవిలో నియమించారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. ఈయన తక్షణమే విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
సీబీఐలో డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెల్సిందే. దీంతో స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా జట్టుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ అంతర్గత పోరుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని మోడీ తప్పించారు. అలాగే, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ వర్మా ఆస్థానాలను సెలవుపై ఇంటికి పంపించారు. ఆ తర్వాత సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా నాగేశ్వర రావుకు బాధ్యతలు అప్పగించారు.
కాగా, 1986 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు.. ఒడిశా కేడర్‌లో విధులు నిర్వర్తించారు. గతంలో ఒడిశా డీజీగా కూడా పనిచేశారు. విజయరామారావు తర్వాత తెలంగాణ అధికారికి సీబీఐ డైరెక్టర్ అవకాశం వచ్చింది. నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.