ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (09:07 IST)

తెలంగాణ రాష్ట్ర పీసీసీ పగ్గాలు ఆయనకేనా?

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవి ప్రస్తుతం ఖాళీగా వుంది. దుబ్బాక ఎన్నికలతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
 
దీంతో కొత్త పీసీసీ సారథి కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేపట్టింది. అయితే, ఈ పదవికి అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ కూడా చేస్తున్నారు. 
 
దీంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఇటీవలే పార్టీలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డికే ఆ పదవిని కట్టబెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయంలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పార్టీలోని మెజారిటీ నేతలు ఆయన పేరును ప్రతిపాదించడంతోపాటు, ప్రజాకర్షక నేత కావడంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గుచూపింది.
 
మరోవైపు, పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వమంటూ ఇటీవల అధిష్టానాన్ని కలిసిన  కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా చోటు కల్పించే అవకాశం ఉంది. 
 
ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఏఐసీసీలోకి తీసుకోనుండగా, సంపత్‌ కుమార్‌ను ఎస్సీ కోటాలో, మధుయాష్కీ గౌడ్‌ను బీసీ కోటాలో, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించనున్నట్టు తెలుస్తోంది.
 
అలాగే, టీపీసీసీ చీఫ్ రేసులో చివరి వరకు ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును సీఎల్పీ నేతగా నియమించనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి కనుక ప్రచార కమిటీ పదవిని ఆశిస్తే కనుక భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా కొనసాగించి, శ్రీధర్ బాబును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, లేదంటే ఏఐసీసీలోకి కానీ తీసుకోవాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.