సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:43 IST)

తెలంగాణలో రేషన్‌కార్డు దరఖాస్తులకు మోక్షం!

రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. త్వరలో రేషన్‌కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ బహిరంగ సభలో ప్రకటించటంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

తెలంగాణ ఏర్పడిన తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేషన్‌కార్డులు జారీ చేస్తామని ప్రకటించటం ఇదే తొలిసారి. తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో 1.05 కోట్లవరకు కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంఖ్యకన్నా వీటి సంఖ్య ఎక్కువని ప్రభుత్వం గుర్తించింది.

అనర్హుల కార్డులను తొలగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించటం అప్పట్లో సంచలనమైంది. ఆ తరవాత అధికారులు ఏరివేత ప్రక్రియను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తొలగించారు.

ఆరోగ్యశ్రీ పథకానికి, బోధన రుసుంల చెల్లింపునకు రేషన్‌కార్డు పనిచేయదని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో కొంతమంది స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87.54 లక్షల కార్డులు ఉన్నాయి. వారికి చౌకధరల దుకాణాల ద్వారా ప్రతినెలా సరకులు అందుతున్నాయి.
 
అప్రకటిత నిషేధం
గడిచిన అయిదారేళ్లుగా నూతన కార్డుల జారీపై అప్రకటిత నిషేధం అమలులో ఉంది. ఒకదశలో దరఖాస్తుల స్వీకరణను కూడా నిలిపేశారు. అయినా సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది వాటికోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు.

ముఖ్యమంత్రి తాజా ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి కార్డులు జారీ చేస్తారా? లేక ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.