తెలంగాణ స్థానికం టీఆరెస్ వశం... ఓటర్లకు ధన్యవాదాలు: కెసిఆర్
తెలంగాణాలోని 120 మునిసిపాలిటీలకు , 9 మంది నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. 120 మునిసిపాలీటీలలకు గాను 107 మునిసిపాలిటీలు, తొమ్మిది నగర పాలకసంస్థలకు గాను 7 నగర పాలక సంస్థలను కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంత ఘన విజయం అందించిన ఓటర్లు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ,గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని వినమ్రతతో అన్నారు.
కేసీఆర్ సర్కార్ పనితీరుకు అద్దం పడుతోంది
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయానికి ముఖ్యకారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టిన ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన పని చూసే ప్రజలు తెరాసకు ఓటు వేశారని, తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే: హరీశ్ రావు
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం కనిపిస్తోందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం తెరాసదేనని మరోసారి రుజువైందన్నారు. సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అభినందనలు చెప్పారు. విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు.
పుర పాలిక ఎన్నికల్లో తెరాస విజయ దుందుభి మోగించింది. అత్యధిక మున్సిపాలిటీల్లో తెరాస అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో తెరాసకు కాంగ్రెస్, భాజపా పోటీ ఇవ్వలేకపోయాయి.
120 మున్సిపాలిటీలకుగాను 109 పురపాలికల్లో తెరాస, ఒక చోట ఎంఐఎం ఆధిక్యంలో నిలిచాయి. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ తెరాసనే ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణ భవన్‌లో తెరాస శ్రేణుల సంబురాలు చేసుకుంటున్నాయి.