సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:29 IST)

కేటీఆర్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌... ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు మంత్రి అభినందన

రెండు రోజుల కిందట తన వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌ వేసిన ఎస్‌ఐ ఐలయ్య,కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లను మంత్రి కేటీఆర్‌ సోమవారం అభినందించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒక్కటే అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళలా ముందుంటానని చలాన్‌ విధించిన రోజు వాహనంలో తాను లేనని మంత్రి పేర్కొన్నారు.

అయితే, బాపుఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్‌ రూట్‌లో వచ్చిందన్నారు. వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య,కానిస్టేబుల్ వెంకటేశ్వర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు.

విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకు ఎప్పుడూ తాము అండగా ఉంటామన్నారు.మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్‌ను సైతం చెల్లించారు