బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (08:14 IST)

తెలంగాణలో అందుకే కరోనా వ్యాప్తి... రాములమ్మ విశ్లేషణ

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు. ‘ప్రపంచంతో పాటు, మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణను లాక్‌డౌన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణాన్ని విశ్లేషిస్తూ... ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉన్న వందలాది మంది కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్‌లకు తరలించడం వల్లే ఈ సమస్య పెద్దదయిందని కొంతమంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈరోజు తెలంగాణ సమాజం ఇంత ఆందోళన చెందడానికి కూడా ఇదే కారణమని వారు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఎలాంటి వైద్య పరీక్షలూ చేయకుండా, ప్రభుత్వం నిర్లిప్తతతో వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి.

కానీ రాజకీయ విమర్శలు చేయడానికి ఇది సందర్భం కాదు గనక... ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించి, తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాను. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో పాటు.. ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉంద’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.