నల్గొండ ప్రాజెక్టులపై వివక్ష ఎందుకు కేసీఆర్?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ చూపిస్తున్న వివక్షపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెయ్యి కోట్లు కేటాయిస్తే 4-5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీశైల సొరంగం, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించట్లేదని ప్రశ్నించారు.
సిద్దిపేటకు వందల కోట్లు ఇస్తూ నల్గొండ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలు తెలంగాణ పౌరులు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు నార్కెట్‌పల్లిలో పర్యటించిన వెంకట్ రెడ్డి వివేరా హోటల్‌లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని విమర్శించారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్‌కు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్న కేసీఆర్.. బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు, శ్రీశైలం సొరంగంకు ఎందుకు నిధులు మంజూరు చేయట్లేదని ప్రశ్నించారు.
శ్రీశైల సొరంగం పనులకు రూ. వెయ్యి కోట్లు, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు రూ. 150 కోట్ల నిధులు కేటాయిస్తే 4-5 లక్షల ఎకరాల పంటకు సాగు నీరు అందుతుందని వివరించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తున్న పట్టించుకునే నాదుడే లేడని దుయ్యబట్టారు. సిద్దిపేట, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మీద ఉన్న శ్రద్ధ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల మీద లేదని విమర్శించారు.
ఈ రెండు ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిధులు కేటాయించక పోవడానికి నిరసనగా జనవరి 7వ తేదిన నార్కెట్ పల్లిలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్భందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యక్రర్తలు, రైతులు కుటుంబసమేతంగా పాల్గొంటారని తెలిపారు.
ఆరోజు రోడ్డుపైనే వంట వార్పు చేపట్టి సర్కార్ తీరును ఎండగడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పోలీసులతో నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే తరువాతి రోజు సైతం నిరసన చేపడుతామన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీ రైతుల తరహా ఉద్యమాలు రాష్ట్రంలో చేపడుతామని స్పష్టం చేశారు.
అదేవిధంగా సర్కార్ తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ పథకంపై స్పందించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆపి లక్షలాది మంది పొట్ట కొట్టారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ అని తెలంగాణలోని ప్రజల రక్తం పిండి 5లక్షల కోట్ల ఆదాయం సమకూర్చేందుకు చూస్తుందని దుయ్యబట్టారు.
ఎంతో మంది ఫ్లాట్లు అమ్మి కూతుళ్ల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు చేయించాలంటే వీలులేకుండా పోయిందని తెలిపారు. ఆ తల్లిదండ్రుల ఉసురు తప్పకుండా ముడుతుందని తెలిపారు. జనవరి 9వ తేదీన హైకోర్టులో కేసు విచారణ ఉందని.. ఎల్ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మతిస్థిమితం లేని కేసీఆర్ చర్యల వల్ల దాదాపు 25లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వం స్పందించి ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయకపోతే సంక్రాంతి తరువాత ఐదు రోజులపాటు నిరాహారదీక్ష చేపతానని స్పష్టం చేశారు.దీక్ష తేదీలను పార్టీలో చర్చించి వివరిస్తారని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ కల్వకుంట్ల ఎలుబడిలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, కాయకష్టం చేసుకునే ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.