మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (19:31 IST)

మోదీ ముందు మోక‌రిల్లిన కేసీఆర్: సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు

బ‌లౌదామా... బ‌తుకుదామా?  మ‌నం న‌డ్డి విర‌గ్గొంటించుకుందామా??  తిర‌గ‌డ‌దామా... ఖ‌మ్మం రైతు క‌వాతులో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వేసిన ప్ర‌శ్న‌లు.. తూటాలా పేలాయి.. కేసీఆర్ పై చేసిన ఏక వ‌చ‌న ప్ర‌యోగం కూడా.. క‌వాతులో పాల్గొన్న రైతుల‌ను ఉత్తేజ ప‌ర‌చాయి... ఖ‌మ్మం జిల్లాలో జ‌రిగిన రైతు క‌వాతుపై పూర్తి విశ్లేష‌ణ‌....
 
సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన రైతు క‌వాతు ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో క‌దం తొక్కింది. ప‌ట్ట‌ణంలో ఎటు చూసినా తిరంగా జెండా రెప‌రెప‌లాడింది. వేలాదిమంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, మిత్ర‌ప‌క్షాల నేత‌లు.. రైతులు స్వ‌చ్ఛందంగా ఈ క‌వాతులో పాల్లొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత భ‌ట్టి నిప్పులు చెరిగారు. ఒక ద‌శ‌లో ఆయ‌న  మాట‌ల తూటాలు పేల్చారు. భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌సంగిస్తున్నంత సేపు.. కార్య‌క‌ర్త‌లు, రైతులు చ‌ప్ప‌ట్లు, విజిల్స్ తో మోత మోగించారు. ముఖ్యంగా కేసీఆర్ పై ....నువ్వెవ‌డ్రా.... అని మాట్లాడిన స‌మ‌యంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. 
 
ఈ ధ‌ర్నాలో భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లుతో పాటు, రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్య‌క్షులు క‌త్తి వెంక‌ట స్వామి,  జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు పువ్వాళ్ల దుర్గా ప్ర‌సాద్‌, న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ జావీద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర రావు, వామ‌ప‌క్ష నాయ‌కులు పోటు ప్ర‌సాద్‌, సింగు న‌ర‌సింహ‌రావు, తాటి వెంక‌టేశ్వ‌ర్లు, జిల్లా బీసీ సెల్ అధ్య‌క్ష‌లు పుచ్చ‌కాయ‌ల వీర భ‌ద్రం, జెడ్పీటీసీలు ప్ర‌వీణ్ నాయ‌క్‌, బెల్లం శ్రీనివాస్‌, సుధీర్ బాబు, కిసాన్ కాంగ్రెస్ శేఖ‌ర్ గౌడ్‌,  కార్పొరేట‌ర్ వ‌డ్డేప‌ల్లి న‌ర‌సింహారావు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్య‌క్షులు నూతి స‌త్యనారాయ‌ణ‌, దీప‌క్ చౌద‌రి, బాల‌గంగాధ‌ర్ తిల‌క్‌, స్సీ సెల్ అధ్య‌క్షులు బొడ్డు బొంద‌య్య మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షులు ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ఇప్పుడున్న స‌మ‌స్య చాలా గంభీర‌మైంద‌ని అన్నారు. ఈ దేశ ఆర్థిక ప‌రిస్థితికి వెన్నుముకైన వ్య‌వ‌సాయ రంగం అత్యంత క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ జై జ‌వాన్‌.. జై కిసాన్ అంటూ దేశాన్ని ముందుకు న‌డిపింద‌న్నారు.  కాంగ్రెస్ పార్టీ 136 ఏళ్ల కింద‌ట ఈ రోజు ఆవిర్భ‌వించి.. దేశానికి స్వ‌తంత్రం తెచ్చింద‌న్న విష‌యాన్ని  ఆయ‌న గుర్తు చేశారు.

స్వ‌తంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతులు, వ్య‌వ‌సాయం బాగుండాల‌ని గ్రీన్ రెవ‌ల్యూష‌న్ తీసుకువ‌చ్చింద‌ని అన్నారు. రైతుల సంక్షేమం కోసం నాడు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌చ్చింద‌ని గుర్తు చేశారు. దేశానికి వెన్నుముక‌లాంటి రైతును నేడు ఇబ్బంది పెట్టేలా మోడీ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆయ‌న  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
రైతు పండించిన పంట‌ను రైతులు జీవితాల‌ను ప్ర‌ధాన‌మంత్రి మోడీ,  గుజ‌రాతీ వ్యాపార‌స్థుల చేతుల్లో పెడుతున్నార‌ని మండి పడ్డారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని అన్నారు. వ్య‌వసాయం మొత్తం అంబానీ, అదానీ చేతుల్లోకి వెళితే.. రైతులు న‌డ్డివిరిగి.. చివ‌ర‌కు ఈ దేశం కూలిపోతుంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఖ‌బ‌డ్దార్ న‌రేంద్ర మోదీ అని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మ‌రో 18 పార్టీల‌ను క‌లుపుకుని.. పార్ల‌మెంట్ లో నిల‌దీసింద‌ని అన్నారు. దేశంలోని వ్య‌వ‌సాయ రంగాన్ని మోదీ వ్యాపార‌స్తుల చేతుల్లో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. 
 
రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాలుగురోజులు కాక‌ముందే తోక‌ముడిచి ఢిల్లీవెళ్లి.. న‌రేంద్ర మోదీ ముందు మోక‌రిల్లార‌ని అన్నారు. అయ్యా.. నీకు దండం పెడ‌తా.. నీకు వ్య‌తిరేకంగా నేనేం చేయ‌ను అని మోదీముందుకు మోక‌రిల్లార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

రైతులు పండించిన పంట‌ను మేము కొనం.. గ‌త ఏడాది కంటే రూ. 7500 కోట్లు న‌ష్టం వ‌చ్చింది.. మేము నిర్భంధ వ్య‌వ‌సాయాన్ని వెన‌క్కు తీసుకుంటున్నాం... అని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై భ‌ట్టి విక్ర‌మార్క నిప్పులు చెరిగారు. సిగ్గు, బుద్ధిలేని ఈ కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ మొద‌ట‌నుంచీ చెబుతున్నా.. విన‌డం లేద‌ని ఆగ్ర‌హంగా అన్నారు. నిర్భంధ వ్య‌వ‌సాయాన్ని కేసీఆర్ వెన‌క్కు తీసుకోవ‌డం రైతుల విజ‌యంగా భ‌ట్టి అభివ‌ర్ణించారు. 
 
ఇదిలావుండ‌గా.. పంట‌ను కొన‌ను అస‌లు నువ్వెవ‌డ్రా.. అని కేసీఆర్ పై బ‌ట్టి మాట‌లు తూటాలు పేల్చారు. ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌దే రైతుల‌ను ర‌క్షించ‌డానికి..అని చెప్పారు. ఆనాటి ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ప్ర‌భుత్వాలు పంట‌ను కొన‌డానికి ఒక బాధ్య‌త‌గా తీసుకున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాక మినిమం స‌పోర్ట్ ప్రైస్ పేరుతో ద‌ళారుల నుంచి రైతుల‌ను ప్ర‌భుత్వాలు ఆదుకున్నాయ‌ని చెప్పారు.