రైతుల నోట్లో మట్టి కొట్టేందుకే కేసీఆర్ యత్నం: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రైతుల పట్ల వివక్ష చూపుతున్న సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధికి పాటుపడాల్సిన సర్కార్ రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని సభ పెట్టి మరీ తిట్టి.. రైతుల బంద్‌కు మద్దతు తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు అదే నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. స్వయాన రైతును అని చెప్పకునే కేసీఆర్‌కు రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు.
రైతుల పొట్ట కొట్టే నూతన చట్టాలకు మద్దతు ఇవ్వడం బాధాకరమన్నారు. ఎక్కడ తను చేసిన అవినీతి బయటపడుతుందోనని భయపడి కేసీఆర్ ఇప్పుడు మోడీ పంచన చేరాడని విమర్శించారు. రాష్ట్రంలో 70శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారని వారిని జీవితాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగాథంలోకి నెట్టుతున్నాయని మండిపడ్డారు.
రైతులకు అండగా ఉండేందుకు గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఐకేపీ కేంద్రాలను ఇకపై రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథలో లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ కేసీఆర్.. రైతులకు ఇచ్చిన రూ.7500 కోట్లు ప్రభుత్వానికి నష్టమని తెలపడంపై మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన నిధులను నష్టంగా భావిస్తున్న కేసీఆర్‌కు కర్షకుల పట్ల ఉన్న చిత్తశుద్ది తెలుస్తుందని వివరించారు.
దేశానికే అన్నం పెడుతున్న రైతన్న నోట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మట్టి కొడుతున్నాయని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో నూతన చట్టాల అమలును విరమించుకోకుంటే ఢిల్లీ తరహాలో రైతు ఉద్యమం చేపడుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు.
అలాగే రాష్ట్ర సర్కార్ తీసుకువచ్చి ప్రజల సొంతింటి కల నేరవేరకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్పై హైకోర్టులో వేసిన పిటిషన్ జనవరి 9న తేది విచారణ ఉందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ విషయంలో న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దని తెలిపారు. త్వరలోనే ఎల్ఆర్ఎస్ రద్దు కొరకు బాధితులతో కలిసి నిరాహార దీక్ష చేయనున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్ర సర్కార్ దిగిరాకపోతే ప్రగతిభవన్ ముట్టడితో పాటు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణ మారిందన్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యలు, ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ల ఆత్మహత్యలు, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ లేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి భ్రష్టుపడిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రైతులు,యువతకు న్యాయం చేస్తామని వివరించారు.