శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (10:12 IST)

భర్త మీద కోపంతో బయటకు వస్తే రూ. 1 లక్షకి అమ్మేసిన వృద్ధురాలు

భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. దాంతో తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వివాహిత బయటకు వచ్చేసింది. సికింద్రాబాద్ స్టేషనులో పిల్లల్ని పెట్టుకుని దిగాలుగా కూర్చుంది. వారిని గమనించిన ఓ వృద్ధురాలు పని ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి వారిని రూ. 1 లక్షకి అమ్మేసింది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధిత వివాహితది తెలంగాణలోని సిరిసిల్ల వేములవాడ. ఆమెకి ఐదేళ్లక్రితం వివాహమైంది. గత మార్చి నెలలో భార్యాభర్తల మధ్య గొడవైంది. దీనితో మనస్తాపానికి గురైన సదరు వివాహిత తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని రైలెక్కి సికింద్రాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో ఆమెను ఓ వృద్ధురాలు గమనించి, పని ఇప్పిస్తానని చెప్పి మహారాష్ట్ర పర్భిణీకి తీసుకెళ్లి అక్కడ మోరా అనే వ్యక్తికి రూ. 1 లక్షకి అమ్మేసింది. అతడు రాజారామ్ అనే వ్యక్తికి, ఆ వ్యక్తి నాసిక్ సమీపంలో వున్న కుగ్రామానికి చెందిన బాబు లక్ష్మణ్ జగపత్‌కు అప్పగించాడు.
 
జగపత్‌కు అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి. తనకు మూడో భార్యగా వుండాలంటూ ఆమెను వేధించాడు. తను మోసపోయానని గ్రహించిన బాధితురాలు విషయాన్ని భర్తకు చెప్పాలని ప్రయత్నించింది. ఐతే ఆమెకి ఫోను అందుబాటులో లేకుండా చేసాడు జగపత్. కానీ ఎలాగోలా ఫోన్ సంపాదించి విషయాన్ని భర్తకు చేరవేసింది. దీనితో ఆమె భర్త వేములవాడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు. పోలీసులు వెంటనే బాధితురాలు వున్న ప్రాంతాన్ని సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించి అక్కడి చేరుకున్నారు. ఆమెని, ఇద్దరు పిల్లలికి విముక్తి కల్పించి జగపత్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.