గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (12:56 IST)

మంత్రి కేటీఆర్‌కు షర్మిల విషెస్ - ఆ సంకల్పం మీకు ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పనిలోపనిగా ఆయనపై విమర్శలు కూడా గుప్పించారు.
 
వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే చనిపోతున్నట్టు ఆమె చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో చెప్పిందని షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
'కేసీఆర్‌గారి కొడుకు కేటీఆర్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు.. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను ఇవ్వాలి' అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.
 
'54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీఎంబ‌ర్స్‌మెంట్  ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకొంటున్నాను. మీ బాధ్యతను గుర్తుచేసె చిన్న వీడియో కానుక' అని ష‌ర్మిల పేర్కొన్నారు.