లోటస్‌పాండ్‌కు వచ్చిన పోలీసులకు హారతి ఇచ్చిన వైఎస్.షర్మిల.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఉన్న తన ఇంటికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మహిళా పోలీసులకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్పూర హారతి ఇచ్చారు. దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్‌లోని జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అక్కడ పర్యటించాలని నిర్ణయించుకున్న షర్మిలను అనుమతి లేదంటూ పోలీసులు గృహనిర్బంధం చేశారు. గజ్వేల్ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగగా.. అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
పోలీసులు గృహనిర్బంధం చేయడంపై షర్మిల వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులకు హారతి ఇచ్చారు. డ్యూటీ సరిగా చేయండి సార్ అని వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న భారాస నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. 'పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలి.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి మమ్మల్ని పట్టుకుంటున్నారు. దేనికోసం అనుమతి తీసుకోవాలి? ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? కేసీఆర్ నన్ను చూసి భయపడుతున్నారు' అని షర్మిల అన్నారు. ఆ తర్వాత ఆమె తన నివాసంలోనే దీక్షకు దిగారు. ఈ దీక్ష శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది.