బుధవారం, 25 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (17:24 IST)

పవన్ సార్, అనుకోకుండా అపార్థం జరిగి వుంటే క్షమించండి అంటూ కార్తీ

Hero Karti
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అటు పాలక పార్టీ, ఇటు వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే స్వామివారి కోనేరులో మునకలు వేసి మరీ ప్రతిజ్ఞ చేసారు. లడ్డూ ప్రసాదంలో తన హయాంలో కల్తీ జరిగినట్లయితే తను తన కుటుంబం సర్వనాశనమైపోవాలంటూ దీపం చూపిస్తూ ప్రమాణం చేసారు. ఇదిలావుంటే హైదరాబాదులో కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం సినిమా ప్రి-రిలీజ్ వేడుక జరిగింది.
 
ఈ సందర్భంగా యాంకర్.. లడ్డూ కావాలా నాయనా అంటూ అడిగింది. దీనికి సమాధానంగా లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి మాట్లాడకూడదు అంటూ కార్తి బదులిచ్చారు. ఈ మాటలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసారు. సినిమాకు సంబంధించినవారు సనాతన ధర్మానికి మద్దతుగా వుండాలనీ, లేదంటే మాట్లాడకుండా వుండటమే మంచిదన్నారు.
 
దీనితో కార్తీ వెంటనే తన ట్విట్టర్ హ్యాండిల్ లో స్పందిస్తూ.. పవన్ సార్ అనుకోకుండా ఏదైనా అపార్థం చోటుచేసుకుని వుంటే నన్ను క్షమించండి. మీపై నాకు ఎంతో గౌరవం వుంది. వేంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను సాంప్రదాయాలను గౌరవిస్తానంటూ తెలిపారు. ఆయన పెట్టిన పోస్టులకు నెటిజన్లు స్పందిస్తూ... ఇందులో మీరు సారీ చెప్పాల్సిందేమీ లేదనీ, యాంకర్ అలాంటి ప్రశ్నను అడకుండా వుండాల్సింది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.