కనకదుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్రం చేసిన పవన్ కల్యాణ్ (video)
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా పవన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పవన్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత ఆయన ఆలయ మెట్లను శుభ్రం చేశారు.
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్లు కడిగిన తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు.
ఈ సందర్భంగా ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అక్టోబర్ 1న పవన్ తిరుమల వెళ్లి, అక్టోబర్ 2న అక్కడ దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా పవన్ తిరుమల చేరుకుంటారు. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను పవన్ నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను ఏ మతంపై విమర్శలు చేయలేదని, తిరుమల లడ్డూ అపవిత్రం అయితే దానిపై స్పందించడం తప్పేమిటని పవన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూపై వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు.