ఇది ఇనుపరాతి యుగమా? మగాళ్లు మృగాలుగా ఎలా మారుతున్నారు?
హైదరాబాద్ నగరంలో పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పలువురు సెలెబ్రిటీలు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ఇది ఇనుపరాతి యుగమో.. పాతరాతి యుగమో అర్థం కావడం లేదంటూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు మగాళ్లు మృగాలుగా ఎలా ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదని.. భారతీయులమేనా అన్న అనుమానమొస్తోందన్నారు. వైద్యురాలికి పుష్పాంజలి ఘటించిన ఆయన.. ప్రజాగ్రహాన్ని చూసిన రాజకీయ పెద్దలు పార్లమెంటులో నిర్భయను మించిన చట్టం తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. కేసీఆర్ శైలిపై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక హత్యపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించాలన్నారు. హైదరాబాద్‌లో పబ్, క్లబ్ కల్చర్‌ను పెంచి పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదిలావుంటే, ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు న్యాయ సహాయం చేయొద్దంటూ మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ తీర్మానించింది. శనివారం బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు. నిందితులు తీవ్ర నేరానికి పాల్పడినందున వారి తరపున ఎవరూ వకాల్తా తీసుకోవద్దని ఈ సందర్భంగా న్యాయవాదులు నిర్ణయించారు.