గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (09:08 IST)

ప్రభాస్ - పూజల ప్రేమకథ 'రాధేశ్యామ్' మార్చి 18కి వాయిదా!

ప్రభాస్ - పూజా హెగ్డే నటించిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూలు, సినిమా థియేటర్లకు 50 శాతం సామర్థ్యం ఇలా అనేక రకాలైన ఆంక్షలను విధిస్తున్నాయి. 
 
మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 10వ తేదీ తర్వాత లాక్డౌన్ విధించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో 'రాధేశ్యామ్' చిత్రం విడుదలపై మూవీ మేకర్స్ పునరాలోచన చేసినట్టు సమాచారం. ఫలితంగా మార్చి 18వ తేదీకి ఈ చిత్రాన్ని వాయిదావేసినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన చేయాల్సివుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
కాగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శన సాగుతోంది. అయితే, తమిళనాడు, బీహార్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ఇవన్నీ ఈ సినిమా విడుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.