1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (08:50 IST)

వెనక్కి తగ్గిన 'రామారావు ఆన్ డ్యూటీ'

తెలుగు చిత్రపరిశ్రమలో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితే. 2021లో "క్రాక్'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయడమే కాకుండా నిర్మాతకు, బయ్యర్లకు లాభాల పంట పండించాడు. ఈ క్రమంలో వచ్చే యేడాది ప్రథమార్థంలోనే రెండు చిత్రాలు విడుదల చేసేలా ప్లాన్ చేశారు. వీటిలో ఒకటి "ఖిలాడీ", మరొకటి "రామారావు ఆన్ డ్యూటీ". 
 
ఈ రెండు చిత్రాల్లో 'ఖిలాడి' మాత్రం ముందుగా ప్రకటించినట్టుగానే ఫిబ్రవరి 11వ తేదీన విడుదలకానుంది. కానీ, 'రామారావు ఆన్ డ్యూటీ' మాత్రం వాయిదాపడింది. నిజానికి ఈ చిత్రాన్ని కూడా కేవలం నెల రోజుల గ్యాప్‌లో అంటే మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కానీ, ఇపుడు మనసు మార్చుకున్నారు. 
 
'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు కొత్త తేదీని వెల్లడిస్తామని దర్శకుడు శరత్ మండవ తెలిపారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అయితే, ఈ చిత్రాన్ని ఉన్నట్టుండి వాయిదా వేయడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. రవితేజ నటించిన  రెండు చిత్రాల విడుదలకు వ్యవధి నెల రోజులు మాత్రమే ఉండటం వల్ల వాయిదావేశారా? లేదా దేశంలో ఒమిక్రాన్ వైరస్ విరుచుకుపడుతుందని వాయిదా వేశారా అన్నది తెలియాల్సివుంది.