ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (13:40 IST)

శ్వాసపీల్చుతున్న ఎస్.పి.బాలు - వెంటిలేటర్ తొలగింపు...

కరోనా వైరస్ బారినపడిన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆయనకు ఇప్పటివరకు అమర్చిన వెంటిలేటర్‌ను తొలగించారు. ఈ విషయాన్ని ఆయన సోదరి ఎస్.పి. శైలజ తెలిపారు. 
 
కరోనా వైరస్ సోకిన ఎస్.పి. బాలు ఈ నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. కానీ, ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎస్.పి.బికి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తన అన్నయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ వెల్లడించారు. మునుపటితో పోల్చితే ఎంతో కోలుకున్నారని తెలిపారు. మంగళవారం వైద్యులు ఆయనకు అమర్చిన వెంటిలేటర్ తొలగించారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకోగలుగుతున్నారని వివరించారు. 
 
తన సోదరుడు చికిత్సకు స్పందిస్తున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తన సోదరుడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనా చికిత్స కోసం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్నిరోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.