అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే నిలబడ్డా : ఉదయభాను
తాను అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే చిత్రపరిశ్రమలో ఇంకా నిలబడివున్నట్టు ప్రముఖ యాంకర్ ఉదయభాను అన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాలు లేక చాలాకాలంగా కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉన్నారు. పరిశ్రమలో అవకాశాలు కరువవడంతో గత ఏడాది ఓ సభలో ఉదయభాను భావోద్వేగానికి గురైంది.
టీవీలో కనిపించి ఐదేళ్లు అయిందని, అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లనే ఇంకా నిలబడ్డానని చెప్పుకొచ్చింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిపేయలేరని వ్యాఖ్యానించింది. ఇప్పుడు మరోమారు అంతకు మించిన వ్యాఖ్యలనే ఉదయభాను చేసింది.
తాజాగా, సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' సినిమా ప్రీరిలీజ్ వేడుకకు వ్యాఖ్యాతగా ఉదయభాను వ్యవహరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల.. వ్యాఖ్యాత ఉదయభానును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చాలా రోజుల తర్వాత ఉదయభాను మళ్లీ కార్యక్రమాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దీనికి ఉదయభాను స్పందిస్తూ ఇదొక్కటే చేశానని, మళ్లీ చేస్తానన్న నమ్మకం లేదని పేర్కొంది. రేపు కార్యక్రమం ఉంటుంది. చేయాలనుకుంటాం, కానీ ఆరోజు వచ్చాక కార్యక్రమం మన చేతిలో ఉండదని, అంత పెద్ద సిండికేట్ ఎదిగిందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
సుహాస్ మా బంగారం కాబట్టి ఈ కార్యక్రమం చేయగలిగానని చెప్పారు. ఉదయభాను చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉదయభాను వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సిండికేట్ అయి తనను తొక్కివేస్తున్నారన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.