ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 24 మే 2018 (15:56 IST)

అసెంబ్లీ వేదికగా 'స్వామి' బలపరీక్ష - కన్నడ సభలో ఏం జరగబోతుంది?

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమార స్వామి శుక్రవారం శాసనసభ వేదికగా తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ విశ్వాస పరీక్షలో ఆయన గట్టెక్కుతారా? కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఏకతాటి

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమార స్వామి శుక్రవారం శాసనసభ వేదికగా తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ విశ్వాస పరీక్షలో ఆయన గట్టెక్కుతారా? కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉంటారా? సభకు అందరూ హాజరవుతారా? కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయితే పరిస్థితి ఏమిటి? అసలు శుక్రవారం సభలో ఏం జరుగబోతుందనే అంశంపై ఇపుడు కన్నడనాట సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంమీద కర్ణాటక అసెంబ్లీ వేదికగా మరోసారి హైడ్రామా జరగబోతోందా?
 
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా రెండు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం 222 మంది సభ్యులున్న శాసనసభలో విశ్వాస పరీక్షలో గట్టెక్కాలంటే స్పీకర్ మినహా 111 మంది మద్దతుండాలి. కాంగ్రెస్ పార్టీకి 78 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీఎస్‌కు 38 మంది సభ్యులు ఉన్నారు. అయితే కుమారస్వామి రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినందున వారిసంఖ్య 37గా లెక్కించుకోవాలి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రభుత్వ పక్షంవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ బలం 117 అవుతుంది. అంటే అందరూ ఓటేస్తే ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కుతుంది.
 
అయితే, యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందు నుంచి ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా రిసార్ట్స్‌లలోనే ఉంటున్నారు. విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఆ తర్వాత కుమార స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేలంతా రిసార్టుల్లోనే ఉంచారు. 
 
ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా వదిలేస్తే వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారని బీజేపీ చీఫ్ అమిత్ షా స్వయంగా ప్రకటించారు. అలాగే, జేడీఎస్‌తో కలవడం 90 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని మాజీ సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే సంకీర్ణ భాగస్వాముల్లో గుబులు రేపుతున్నాయి. 104 మంది సభ్యులున్న బీజేపీ కూడా విశ్వాస పరీక్ష సమయంలో సభకు హాజరు కావాలని భావిస్తోంది. అయితే విశ్వాస పరీక్ష సమయంలో ఓటెయ్యకుండా ఉండిపోవాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.