బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (15:44 IST)

బోరున ఏడ్చేసిన కన్నడ ముఖ్యమంత్రి కుమారస్వామి? ఎందుకు?

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బోరున విలపిస్తున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అన్నో, తమ్ముడో ముఖ్యమంత్రి అయినట్టు తన పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారని చెప్పుక

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బోరున విలపిస్తున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అన్నో, తమ్ముడో ముఖ్యమంత్రి అయినట్టు తన పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ, సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయంటూ కన్నీరు పెట్టుకున్నారు.
 
తాను సీఎం అయినందుకు జేడీఎస్ నేతలు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కుమారస్వామి బొకేలు తీసుకోవడానికి, పూలదండలు వేయించుకోవడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ, 'మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషం కంటే ఏమీ తక్కువ కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను' అని కన్నీళ్ళుకార్చారు.
 
ఎన్నికల ప్రచారం సందర్భంగా తానెక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, అదేమి అదృష్టమో కానీ తన పార్టీ సభ్యులకు మాత్రం ఓట్లు వేయడం మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 'దేవుడైతే నాకీ అధికారం (సీఎం పదవి) ఇచ్చాడు. నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు' అని కుమారస్వామి చెప్పుకొచ్చారు. 
 
కాగా, ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో 38 మంది సభ్యులు కలిగిన జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రిగా కుమార స్వామి కొనసాగుతున్నారు. ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం కుమార స్వామికి కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా రైతు రుణమాఫీలో కాంగ్రెస్ - జేడీఎస్‌ల మధ్య మనస్పర్థలు తలెత్తిన విషయం తెల్సిందే.