సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (10:36 IST)

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు... డిసెంబరులో ఎన్నికలు?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానుందా? వచ్చే డిసెంబరు నెలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ యేడాది నవంబరు లేదా డిసెంబరు నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్న

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానుందా? వచ్చే డిసెంబరు నెలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ యేడాది నవంబరు లేదా డిసెంబరు నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకు అనుగుణంగా సెప్టెంబరు చివరి వారం లేదా అక్టోబర్‌ మొదటి వారంలో శాసనసభ రద్దు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
 
నిజానికి వచ్చే యేడాది ఏప్రిల్‌లో లోక్‌సభతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సందర్భంగా నవంబర్‌ లేదా డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. 
 
లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, తిరిగి రెండోసారి అధికారంలోకి రావాలన్నది కేసీఆర్ కలగా ఉంది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేసి విజయం సాధించి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలన్నది ఆయన ప్లాన్. అలా చేయడం వల్ల తన కుమారుడి కె.తారక రామారావు (కేటీఆర్)ను ముఖ్యమంత్రిగా చేయాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. ఇలా చేయడం వల్ల అటు రాష్ట్రంలో తన తనయుడు, అటు కేంద్రంలో తాను చక్రం తిప్పవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. 
 
వాస్తవానికి నవంబర్‌ లేదా డిసెంబరు నెలల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికలతోపాటే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిపేందుకు వీలుగా అసెంబ్లీ రద్దుకు సీఎం ఇప్పటికే న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేస్తే ఆ 4 రాష్ట్రాలతోపాటే ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులుండవని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.