గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:43 IST)

అన్న దందాలు చేస్తే.. తమ్ముడు నీలి చిత్రాలు తీసేవాడు.. అమృత తండ్రి - బాబాయ్‌ ఘన చరిత్ర

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితులకు ఘనమైన నేర చరిత్ర ఉంది. ఈ కేసులో ఏ1 నిందితుడు మారుతిరావు దందాలు, సెటిల్మెంట్స్ చేస్తుంటే... ఏ2 నిందితుడైన శ్రవణ్ నీలి చిత్రాలు తీసి పోలీసులకు పట్

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితులకు ఘనమైన నేర చరిత్ర ఉంది. ఈ కేసులో ఏ1 నిందితుడు మారుతిరావు దందాలు, సెటిల్మెంట్స్ చేస్తుంటే... ఏ2 నిందితుడైన శ్రవణ్ నీలి చిత్రాలు తీసి పోలీసులకు పట్టుబడి పాతికేళ్ళకే జైలుకెళ్ళాడు. అంతేకాకుండా, ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలో ఉంటూ తమ పబ్బంగడుపుకుంటూ వచ్చేవారు. ముఖ్యంగా, రెవెన్యూ అధికారులకు అంటకాగుతూ అనేక భూదందాలు పరిష్కరించారు.
 
మిర్యాలగూడకు చెందిన దళిత వర్గానికి చెందిన ప్రణయ్‌ను అదే ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన అమృతవర్షిణి అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని వధువు తండ్రి మారుతిరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో మారుతి రావు పాటు ఆయన సోదరుడు శ్రవణ్‌లు ఏ1, ఏ2 నిందితులుగా తేలారు. వీరికి నేరచరిత్ర బాగానే ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 
మారుతిరావు ఓ రేషన్ డీలర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన, అదే శాఖలోని అధికారులతో బలమైన సంబంధాలు ఏర్పరచుకుని, వారి అండతో భూదందాలు సాగించేవాడు. పై అధికారుల సరదాలు తీర్చి, వారితో పనులు చేయించుకోవడంలో మారుతీరావుది అందెవేసిన చేయి.
 
మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లర్లు, ఆర్యవైశ్యుల మధ్య ఏర్పడే పంచాయితీలను మారుతీరావు సెటిల్ చేసేవాడు. కుల సంఘాల నాయకుల అవసరాలను తీరుస్తూ, రాజకీయ నేతలకు దగ్గరగా ఉంటూ, వారిని తనకు అనుకూలంగా మలచుకునేవాడు. 
 
ఈనేపథ్యంలో మారుతీరావు ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఆయన సోదరులు, ఇదే కేసులో అరెస్టయిన మరో నిందితుడు శ్రవణ్, ఓ వైపు కేబుల్ వ్యాపారాన్ని, మరోవైపు బెల్లం వ్యాపారాన్ని సాగిస్తుండేవాడు. అన్న కుమార్తె చేసిన పనిని తట్టుకోలేని శ్రవణ్ కూడా, హత్యకు తనవంతు సాయం చేశాడన్న సంగతి తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడలోని ఓ లాడ్జిలో నీలిచిత్రాలను శ్రవణ్ చిత్రీకరిస్తుండగా, పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.