ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 21 నవంబరు 2021 (13:33 IST)

పెన్నా నది ఉగ్రరూపం, రైల్వే ట్రాక్ పైకి వరద నీరు, నిలిచిపోయిన అనేక రైళ్లు

పెన్నా నది ఉధృతంగా ప్రవహించడంతో రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను కలిపే ప్రధాన రైలు- రహదారి మార్గాలు ఆదివారం నాడు తాత్కాలికంగా నిలిపివేసారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

 
కోస్తా ఆంధ్రలో వర్షాల కారణంగా కనీసం 25 మంది మరణించారు. 17 మంది తప్పిపోయినట్లు అధికారులు చెపుతున్నారు. నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌ పైకి వరద పొంగిపొర్లడంతో చెన్నై-విజయవాడ రైలు మార్గంలో కనీసం 17 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరో మూడు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. నెల్లూరు ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు.

 
కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం పంబ, శబరిమల యాత్రలను నిలిపివేశారు. పంబా నదిలో నీటి మట్టాలు పెరుగుతున్నాయని, కక్కి-అనాతోడ్ రిజర్వాయర్, పంబ డ్యామ్ రెండింటిలో రెడ్ అలర్ట్‌లు ఉన్నాయని జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు.