శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (07:20 IST)

సుప్రీం ఆదేశమిది... రీ షెడ్యూల్ కుదరదు.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన దాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల వాయిదా కుదరదని తేల్చి చెప్పింది. పైగా, ఈ అంశంలోకి ఉద్యోగ సంఘాలు ఎందుకు వచ్చారంటూ సూటిగా ప్రశ్నిస్తూ తీవ్రస్థాయిలో తలంటింది.

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉద్యోగులందరూ పాల్గొనాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మేరకు నిర్వహించాల్సిందేనని.. వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పారు. 
 
కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తయితే తప్ప.. ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాల నేతలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా చెబుతుండడంతో సీఎస్‌ మంగళవారం వారితో అత్యవసరంగా సమావేశమయ్యారు. 
 
ఈ భేటీలో ఆయా సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు కేఆర్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను సవరిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని.. మరి కొద్ది రోజులు వాయిదా వేసి.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సంఘాల నేతలు కోరారు. దీనికి ఆదిత్యనాథ్‌ దాస్‌ అంగీకరించలేదు. ఈ సమయంలో షెడ్యూల్‌ వాయిదా కుదరదన్నారు. దీంతో ఎన్నికలు సాఫీగా సాగేందుకు సహకరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌కు హామీ ఇచ్చారు.