గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (07:08 IST)

అంగట్లో సరకుగా పంచాయతీ సర్పంచ్ సీటు : వైకాపాలో బేరాలు షురూ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు అనుమతితో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉపక్రమించారు. ఈ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం షెడ్యూల్ కూడా జారీచేశారు. ఈ క్రమంలో సీట్లు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు వైకాపా నేతలు బేరసారాలకు దిగుతున్నారు. తాజాగా ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ సీటు కావాలంటే రూ.50 లక్షలు చెల్లించాలంటూ అధికార పార్టీ నేతలు బేరం మాట్లాడుతున్నారు. 
 
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని సుమారు 60 గ్రామ పంచాయతీలకు అధికార పార్టీ తరపున సీటు ఆశిస్తున్న ఆశావహులతో అధికార పార్టీకి చెందిన నాయకుడి బావమరిది బేరాలు మొదలెట్టారు. పోటీ చేయాలంటే ఆయా పంచాయతీల జనాభాను బట్టి నిర్దేశిత మొత్తాన్ని ముందుగా తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఐదు వేల జనాభా ఉన్న పంచాయతీకి 50 లక్షలపైనే అడుగుతున్నారని పలువురు ఆశావహ అభ్యర్థులు చెబుతున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసే వ్యక్తే అధికార పార్టీ మద్దతుతో పోటీ చేసే వార్డు సభ్యులను గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని, దీని కోసమే డబ్బులు ఎంత పెట్టగలరో అడుగుతున్నామని సదరు బావమరిది సెలవిస్తున్నారని సమాచారం. దీంతో అధికార పార్టీ తరఫున సీటు ఆశిస్తున్న చాలామంది ఆశావహులు వెనుదిరుగుతున్నారు. మరికొందరు ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. 
 
కాగా, కృష్ణా జిల్లాలో తొలి దశలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, మూడో విడతలో జరిగే పెడన నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ నాయకులు సర్పంచ్‌ సీటు ఆశిస్తున్న వారితో జరుపుతున్న బేరసారాల తీరిది.