మరో వాన గండం, రాయల సీమతోపాటు కోస్తాంధ్రకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇపుడు దయనీయంగా మారింది. తుపానులు, వరదల భయంతో గడియ గడియకు గండం. గడప గడపకు భయం తొణికిసలాడుతోంది. ఒకప్పుడు చినుకు కోసం ఎదురు చూసిన రాయలసీమలో ఇపుడు వరద పరిస్థితి. కుండపోత వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు జల సంద్రంగా మారాయి. ఎటుచూసినా నీళ్లే, ఎక్కడ చూసినా జల విలయమే కనిపిస్తోంది. ఈ ప్రళయ ప్రమాదం ఇంకా 72 గంటల పాటు ఉందని, భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. మరో 72గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయంటూ, వాతావరణశాఖ పిడుగులాంటి వార్త చెప్పింది మళ్ళీ రాయలసీమ మీదుగానే అల్పపీడనం కొనసాగడం సీమ ప్రజల్ని భయపెడుతోంది.
ఇప్పటి వరకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే వరుణుడు విధ్వంసం సృష్టిస్తే, ఇప్పుడు ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలోనూ ప్రభావం చూపిస్తున్నాడు. ఈ మూడు జిల్లాల్లో ఇప్పుడు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాగల 72 గంటల్లో రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ప్రజల్ని భయపెడుతున్నాయి.