నేరుగా రైతుల ఖాతాలోకి నగదు జమ చేసిన ఏపీ సీఎం జగన్
గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. ఈ సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్ సైక్లోన్ వల్ల రైతులు భారీగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ప్రభుత్వం ఆర్ధికంగా ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా ఏపీ సీఎం రైతులకు మేలు చేయాలని ఈ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేశారు.
మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతులకు పెట్టుబడి రాయితీ అందించారు. ఈ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ లోని 34,586 మంది రైతులు పంట నష్టపోయారని వ్యవసాయశాఖ లెక్కలు తేల్చింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపరిహారం కింద 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ సాయం కింద రూ. 1,071 కోట్లు విడుదల చేసింది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు, రబీలో పంట నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద నేడు రూ.22 కోట్లను సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.