శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (14:10 IST)

ఆంధ్రప్రదేశ్ వరదల‌పై ప్రధానమంత్రి, హోం మంత్రితో మాట్లాడిన ఉప రాష్ట్రపతి

ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని వరద పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద బాధితుల దృశ్యాలు త‌న‌ని క‌లచివేశాయ‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. వ‌ర‌ద‌ల విష‌య‌మై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఈ రోజు ఉదయం ఫోన్ ద్వారా రాష్ట్రంలో వరద పరిస్థితిని  వారికి వివరించారు. 
 
 
ఆంధ్ర రాష్ట్రంలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను, భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రధానికి తెలియజేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, వరద ప్రభావం గురించి కూలంకషంగా వివరించారు. వరద సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు.

 
ఉప రాష్ట్రపతి  తెలియజేసిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రధాని, కేంద్ర హోం మంత్రి తమ వైపు నుంచి ఇప్పటికే సహకారాన్ని అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ అవసరమైన సహకారాన్ని అందజేస్తామని ఉపరాష్ట్రపతికి వివరించారు.