మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (17:38 IST)

'కమలం' వైపు మెగాస్టార్ చూపులు?!

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన "సైరా" చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సందేశాత్మక చిత్రంలో నటించనున్నారు. అయితే, ఈయన త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ, దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో లేదు. పైగా, తెలుగు రాష్ట్రాల్లో కమలనాథులు పట్టుసాధించాలని పరితపిస్తున్నారు. ఇందులోభాగంగా, 'ఆపరేషన్ కమలం'ను చేపట్టారు. ఇందులోభాగంగా, ఇప్ప‌టికే తెలుగు దేశం నుంచి న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పాటు పారిశ్రామికవేత్త అంబికాకృష్ణ వంటి నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు.
 
అలాగే, కాపు సామాజికవర్గానికి చెంది నేతలను తమ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కొంద‌రు బీజేపీ రాష్ట్ర నాయ‌కులు ఇప్ప‌టికే చిరంజీవితో మంత‌నాలు జ‌రుపుతున్నారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చిరంజీవి బీజేపీలో చేరితే అయితే ఆయ‌న‌కు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం.
 
2018లోనే చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున ప్ర‌చారంకూడా చేయ‌లేదు. కాంగ్రెస్‌తో అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న్నిచేర్చుకోవాలని బీజేపీ అగ్ర నాయ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్లు సమాచారం. చిరంజీవితో పార్టీ సీనియర్ నేతలతో పాటు.. రాష్ట్ర నేతలు కూడా ఇదే అంశంపై రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.