గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (12:29 IST)

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రాణహాని : అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా

sidharth-luthra
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపున ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో తన వాదనలు బలంగా వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏసీబీ కోర్టుకు చేరుకుని, చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్నారు. జైల్లో చంద్రబాబును ఉంచడం అత్యంత ప్రమాదకరమన్నారు. గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను కోర్టులో ప్రస్తావిస్తామని తెలిపారు. హౌస్ అరెస్టుపై వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు. 
 
మరోవైపు, శనివారం తెల్లవారుజాము నుంచి ఆదివారం వెకువాము వరకు ఏపీ సీఐడీ పోలీసులు అనుసరించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట ఎప్పుడు హాజరుపరుస్తారోనని శనివారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో నిరీక్షిస్తున్నా. నా న్యాయవాద వృత్తిలో ఇలాంటి "డల్‌ మూమెంట్‌"ను ఎప్పుడూ చూడలేదు' అంటూ ఆదివారం ఉదయం ట్వీట్‌ చేశారు. 
 
చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు శనివారమే ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్న సిద్ధార్థ లూథ్రా.. చంద్రబాబును న్యాయమూర్తి వద్ద హాజరుపరచటంలో సీఐడీ అధికారులు చేసిన తీవ్ర జాప్యంపై తన అసహనాన్ని ట్వీట్‌ రూపంలో వ్యక్తపరిచారు. ఆయన ఏసీబీ కోర్టులో బలంగా వాదనలు వినిపించినప్పటికీ న్యాయమూర్తి మాత్రం చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.