సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:43 IST)

నరేంద్ర మోడీకి పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాదు : చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు మాటలతో దాడి చేశారు. నరేంద్ర మోడీ చదువుకోలేదని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హస్తినలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ సాగిస్తున్న అప్రజాస్వామ్య పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకే తామంతా ఏకమయ్యామన్నారు. మోడీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. 
 
దేశంలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, వారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాన వ్యవస్థలన్నింటిని ధ్వంసం చేస్తున్నారనీ, దీంతో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 
 
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో తప్పుడు అఫిడవిట్‌తో సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించిందన్నారు. ఎక్కడి, ఎవరికి ఇబ్బంది వచ్చినా తామంతా కలిసి ఆందోళన చేశామని, మోడీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని, అందుకే తామంతా ఏకమయ్యామని చెప్పారు.