మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కుక్క కూడా భరించలేకపోతుంది.. జగన్ స్టిక్కర్‌పై చంద్రబాబు ఎద్దేవా!!

jagan sticker
'జగనే మా భవిష్యత్.. జగనే మా నమ్మకం' అనే స్టిక్కర్‌ను చివరకు కుక్క కూడా భరించలేకపోతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. "ఇదేం ఖర్మ రాష్ట్రానికి.." అనే కార్యక్రమంలో భాగంగా, ఆయన గురువారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో జరిగిన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీలోని ప్రతి ఇంటిపై జగన్ స్టిక్కర్ కనిపిస్తుందన్నారు. ఈ స్టిక్కర్‌ను చూసి కుక్కులు కూడా భరించలేకపోతున్నాయని అన్నారు. అందుకే ఓ శునకం.. ఆ స్టిక్కర్‌ను చూసి భరించలేక పీకేసిందని ఎద్దేవా చేశారు.
 
తాను తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశాను, సమైఖ్యాంధ్రలో ఏ రాజకీయ నేతకు లభించనంత గౌరవం తనకు దక్కిందన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నానని గుర్తు చేశారు. అయితే, తాను సీఎంగా ఉన్న సమయంలో చరిత్రలో గుర్తుండిపోయే పనులు చేసినట్టు చెప్పారు.
 
అపుడు సమైక్యాంధ్రలో భాగమైన హైదరాబాద్ నగరంలోని విమాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్, జీనోమ్ వ్యాలీ, బయోటెక్నాలజీ పార్కు వంటి వాటిని చూసినపుడు తన పేరు గుర్తుకు రాకపోవచ్చని, కానీ, ప్రతి ఒక్కరికీ ఒక అంతరాత్మ ఉంటుందని, ఆ పనులు చేసింది ఎవరో ఆ అంతరాత్మ చెబుతుందన్నారు. హైదరాబాద్ నగరం మహానగరంలా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ చేసిన పనులేనని చెప్పారు. అంతేకాకుండా, తెలుగు జాతి యువతకు ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అనే ఆయుధం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పారు.